నగరంలోని శిల్పారామం సంక్రాంతి శోభను సంతరించుకుంది. గురువారం శిల్పారామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. తాను సాధారణ స్థాయి నుంచి ఉప రాష్ట్రపతి స్థాయి వరకు వెళ్లానని.. నాకు వేరే ఆశలు లేవన్నారు. ఈ సంక్రాంతి ప్రజలందరికి క్రాంతి ప్రసాదించాలన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని..కట్టు,బొట్టు మరిచిపోకూడదని పిలుపునిచ్చారు. సంపాదించిన దాంట్లో కొంత ఇతరులకు సాయం చేయాలన్నారు.
తెలుగు భాష అమ్మఒడి లాంటిదని అందరూ కాపాడుకోవాలన్నారు. శిల్పారామంలో గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, హీరో వెంకటేష్, ముప్పవరపు కుటుంబ సభ్యులు, సుజనా చౌదరి, పరిటాల శ్రీరామ్, అశ్వినీదత్, ఎమ్మెల్సీ రామచంద్రారావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ గవర్నర్ తమిళి సై, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు.