కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. పది నుంచి 12వరకు నామినేషన్‌లు స్వీకరించి 24న పోలింగ్ నిర్వహించి, 27న ఓట్ల లెక్కింపు చేపడతారు. రెండు రోజులు ఆలస్యమైనా ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ కావడంతో రాజకీయ పార్టీలతోపాటు అశావాహులు నామినేషన్ వేసే పనిలో నిమగ్నమయ్యారు.
కాగా కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో రెండు రోజులు ఆలస్యంగా కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నిమున్సిపాలిటీలతోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినప్పటికి 3, 24, 25డివిజన్ల ఓటర్ల జాబితాలో తప్పులను ఎత్తిచూపుతు ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. ఎస్సీ ఓట్లను బీసీలుగా, బిసి ఓట్లను ఎస్సీ, ఎస్టీలుగా చూపడంతో మూడు డివిజన్ ల రిజర్వేషన్లు తారుమారయ్యాయి. దీంతో స్థానికులు కోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది. ఓటర్ల జాబితా సవరించిన తర్వాతే ఎన్నికలు జరపాలని కోర్టు ఆదేశించడంతో 7న జారీ కావాల్సిన నోటిఫికేషన్ ఎన్నికల సంఘం నిలిపివేసింది. దీంతో ఆగమేగాలమీద మున్సిపల్ అధికారులు మూడు డివిజన్ ల ఓట్లర్ల జాబితాలోని తప్పులను సవరించి ప్రభుత్వ పెద్దలతోపాటు హైకోర్టును ఆశ్రయించారు.